మన దేశంలో సాధారణంగా కాస్త జ్వరం వచ్చినా, బాడీ పెయిన్స్ ఉన్నా పారాసిట్మాల్ మాత్రలను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రలతో చాలా ప్రమాదం పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఈ మాత్రలను వాడటం ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. ఈ మేరకు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

65 ఏళ్లు, ఆపై వయసు దాటినవారికి దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీర్ఘకాలం పారాసిట్మాల్ వాడటం వల్ల జీర్ణకోశ, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హామ్‌కు చెందిన పరిశోధకులు ఆ దేశంలో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
పారాసిట్మాల్‌లో వృద్ధుల్లో పెప్టిక్ అల్సర్ రక్తస్రావమయ్యే ప్రమాదం 24 శాతం, దిగువ జీర్ణాశయాంతర రక్తస్రావమయ్యే ప్రమాదం 36 శాతం ఉందని గుర్తించారు. అలాగే దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం 19 శాతం, గుండె సంబంధిత సమస్యలు 9 శాతం, హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం 7 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు.
తమ పరిశోధనలను నిర్ధారించడానికి తదుపరి పరిశోధన చేయాల్సిన అవసరముందని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా 6 నెలల్లో రెండు ప్రిస్కిప్షన్లు కంటే ఎక్కువ సార్లు పారాసిట్మాల్ వాడిన 180 లక్షల మంది హెల్త్ రికార్డులను.. తరచుగా ఈ మాత్ర వాడని 402 లక్షల మంది హెల్త్ రికార్డులను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here