పెళ్లి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  పెళ్లి సంబంధం చూసేది,  వివాహం జరిపించేది పెద్దలే అయినా ఆ బంధంలో కలిసి ఉండేది మాత్రం పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇద్దరే. జీవితాంతం ఈ బందాన్ని వాళ్లిద్దరే నడిపించుకుంటూ వాళ్లు ఒక కుంటుంబంలా ఏర్పడతారు. అయితే కాబోయే భార్యాభర్తల మధ్య వయసు తేడా అనేది ఆ బంధంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఒకప్పుడు వధూవరుల వయసు దాదాపు 10 నుండి 15 ఏళ్లు ఉంటుండేది.  ఆ తరువాత వయసు తేడా తగ్గింది. ఇప్పటి జనరేషన్ లో అయితే సమ వయస్కులను పెళ్ళి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేయడం సరైనదేనా?  చాలా బంధాలలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? వయసు కారణంగా గొడవలు జరుగుతున్నాయనే మాటల్లో వాస్తవం ఎంత?

అబ్బాయి లేదా అమ్మాయి మధ్య సంబంధం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా  మొదట ఇద్దరి వయస్సును అడుగుతారు. భారతీయ సమాజంలో అమ్మాయి పెళ్లి వయస్సు అబ్బాయి కంటే తక్కువగా పరిగణించబడుతుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవాడై ఉండాలి, ఒక సంవత్సరం పెద్దవాడా, 10 ఏళ్లు పెద్దవాడా అనే విషయంపై పెద్దగా చర్చ జరగదు.  లైఫ్ సెటిల్ అయిపోతుందని అనిపిస్తే వయసుతో సంబందం లేకుండా పెళ్లిళ్లు చేసేస్తారు.

విజయవంతమైన వివాహ బంధాలను గమనిస్తే.. భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం తక్కువగా ఉండాలి. 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఉండటం ఉత్తమంగా పరిగణించబడుతుంది.

తక్కువ వయసు గ్యాప్ ఉంటే..

తక్కువ వయస్సు తేడా కారణంగా, భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి వారి ఆలోచనా విధానం వల్ల వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడిచిపోతుంది. కాబట్టి, వివాహానికి వయస్సు తేడా విషయంలో చాలా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండకూడదు అని  అంటున్నారు. 3 నుండి 5 సంవత్సరాల వయసు తేడా ఉంటే అమ్మాయిలు ఆ భాగస్వామితో అన్ని విధాలా సఖ్యతగా ఉండగలుగుతారట.  సైకాలజీ ప్రకారం.. అమ్మాయిలు అబ్బాయితో పోలిస్తే  సాధారణ భౌతిక వయసు కంటే 5ఏళ్లు ఎక్కువ మెచ్యూరిటీతో ఉంటారట.  దీని ప్రకారం 3 నుండి 5 ఏళ్ల వయసు గ్యాప్ ఉంటే ఇద్దరి ఆలోచనా విధానాలు, ఇద్దరి మెచ్యూరిటీ దరిదాపుల్లో ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలరు.

చాలా తక్కువ గ్యాప్ ఉంటే..

ఇప్పటి జనరేషన్ లో తక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నవారిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.  దీనికి కారణం విద్య, ఉద్యోగం.  అయితే సమ వయస్కులు,  కేవలం నెలల గ్యాప్ ఉన్నవారి మధ్య అహానికి తావు ఎక్కువ ఉంటుంది. ఏదైనా వాదన వచ్చినప్పుడు నువ్వేమైనా పెద్దవాడివాఅనే ప్రశ్న.. నువ్వేమైనా చిన్న దానివా అనే ప్రశ్న అమ్మాయి అబ్బాయిల ఇద్దరి నుండి వస్తుంది.  దీని వల్ల ఇద్దరికి గొడవలు ఎక్కువ ఉంటాయి. కెరీర్ గురించి,  భవిష్యత్తు గురించి సరైన ఆలోచన, ఏకీభావం లేకపోతే తక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నవారి మధ్య గొడవలు ఎక్కువ,  విడిపోయే అవకాశాలు ఎక్కువే..

ఎక్కువ ఏజ్ గ్యాప్..

కొంతమందిని గమనిస్తే..  అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ 10 నుండి 15 ఏళ్ల వరకు ఉంటుంది.  ఈ గ్యాప్ వల్ల అబ్బాయి పెద్దవాడిగానూ, అమ్మాయి చాలా చిన్నగానూ ఉంటుంది.  వారిద్దరికి పిల్లలు అయ్యి వారి పెళ్లి వయసు వచ్చేసరికి తండ్రి పూర్తీ వృద్ధుడిగా మారతాడు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక.. భర్త మరణిస్తే.. ఆ తల్లి ఒంటరిగా ఎక్కువ కాలం బ్రతకాల్సి ఉంటుంది. అంతే కాకుండా జనరేషన్ అలోచనల దగ్గర కూడా గొడవలు వస్తాయి.  ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యత్యాసం 3 నుండి 5 ఏళ్ళు ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here