మామూలుగానే రజినీ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే అప్డేట్స్ ఇవ్వండి మహాప్రభో అంటూ మేకర్స్‌ను కోరుతుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఆయన బర్త్ డే వచ్చిందంటే వదులుతారా..? అసలు అప్డేట్ ఇవ్వకుంటే డైరెక్టర్‌ను బతకనిస్తారా చెప్పండి..? అందుకే లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసాడు. అలాగే జైలర్ 2 ముచ్చట్లూ వచ్చాయి. మరి అవన్నీ చూద్దామా..?
ఆహా.. ఎన్ని రోజులైందో కదా రజినీకాంత్ ఇలా మాస్ స్టెప్పులేసి..! జైలర్ తర్వాత మరోసారి ట్రాక్ తప్పారు సూపర్ స్టార్. భారీ అంచనాలతో వచ్చిన వేట్టయన్ నిరాశ పరచడం.. ఆ మధ్య కూతురు కోసం నటించిన లాల్ సలామ్ డిజాస్టర్ కావడంతో.. ఫ్యాన్స్ ఆశలన్నీ కూలీపైనే ఉన్నాయిప్పుడు.
డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా సాంగ్ టీజర్ విడుదల చేసారు మేకర్స్. అందులో తనదైన స్టెప్పులతో కేక పుట్టించారు రజినీ. కూలీలో రజినీ మాత్రమే కాదు.. నాగార్జున, ఉపేంద్రతో పాటు అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు.
2025 సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. దాంతో పాటు జైలర్ 2 కూడా చేయబోతున్నారు సూపర్ స్టార్. నెల్సన్ తెరకెక్కించిన జైలర్ 600 కోట్ల వరకు వసూలు చేసింది. దీనికి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు నెల్సన్.
తాజాగా ఈ స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు వచ్చింది. అన్నీ కుదిర్తే మార్చ్ 2025 నుంచి జైలర్ 2 సెట్స్‌లో జాయిన్ కానున్నారు రజినీ. మొత్తానికి బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు సూపర్ స్టార్.